జిల్లా పరిషత్, మండల పరిషత్ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా పరిషత్, మండల పరిషత్ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఏలూరు,: జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా పరిషత్, మండలపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-అప్క్షన్ సభ్యులు ఎంపికకు పరోక్ష ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా పరిషత్ , మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-అప్క్షన్ సభ్యులు ఎంపికకు ఈనెల 19వ తేదీన మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-అప్క్షన్ సభ్యులు, 20 వతేదీన జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-అప్క్షన్ సభ్యుల ఎంపికకు పరోక్ష ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీట్ల ఏర్పాటు, ఎంపిక సమయంలో నిబంధనల ననుసరించి వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, అనధికార వ్యక్తులెవరినీ అనుమతించవద్దన్నారు. ఎన్నికల పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే , సభ్యులు అందరికీ నోటీసులు అందించాలని, సంబంధిత రిటర్నింగ్ అధికారే ఈ పరోక్ష ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో బారికేడింగ్ ఏర్పాటుచేయాలని, బిఎన్ఎస్ 163 ని అమలు పరచాలని, ఎన్నికల జరిగే ప్రదేశంలో సిసి కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, లైవ్ వీడియో కలెక్టరేట్ కి అనుసంధానించాలన్నారు. వీడియో కవరేజ్ తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు. ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు సిబ్బందితో బందోబస్త్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధలు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా వెంటనే పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలనీ, పోటీలో పాల్గొనే అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కలిగించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం చేపట్టాలని, విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి పొరపాట్లకు, లోటుపాట్లకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ ఎం. కృష్ణమోహన్, డిపిఓ మల్లికార్జునరావు, రిటర్నింగ్ అధికారులు, ఎంపిడిఓలు, ప్రభృతులు పాల్గొన్నారు.