జగన్నాధపురంలో పోలీసుల పల్లె నిద్ర:
* ఎన్నికల వేళ శాంతిభద్రతలపై ప్రజలకు అవగాహన:
* పాల్గొన్న సిఐ నారాయణరావు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని పట్టణ సీఐ కె. నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన గ్రామస్థులకు ఎన్నికల నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 144 సెక్షన్, పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమలుకు సంబంధించి విధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల సమయంలో వ్యక్తిగత విభేదాలు, రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమే పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొద్దల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ రౌతు తిరుపతిరావు, గ్రామ పెద్దలు పొట్నూరు అప్పారావు, మామిడి విజయబాబు, పాలకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పోలీసుల సూచనలను పాటిస్తూ శాంతియుత ఎన్నికలకు సహకరిస్తామని తెలిపారు.