జాతీయ సరస్ ఉత్సవంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్: జాతీయ సరస్ ఉత్సవంలో సందర్శకులు, స్టాళ్ల నిర్వాహకుల భద్రతకు అగ్నిమాపక శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ ప్రివెన్షన్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్సవ సందర్శన నేపథ్యంలో గురువారం ఉదయం భవానీపురంలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన ఆహార విక్రయ స్టాళ్ల ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వంట ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగం, అధిక ఉష్ణోగ్రతలు, సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ పి.వి. రమణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఈ. స్వామి పాల్గొని ఎల్పీజీ సిలిండర్ల సురక్షిత వినియోగం, వంట ప్రాంతాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వాహనాలు సులభంగా సంఘటనా స్థలానికి చేరుకునేందుకు మార్గాలను ఖాళీగా ఉంచాలని, వంట ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉత్సవ ప్రాంగణంలో అగ్నిమాపక భద్రత కోసం ఐదు అగ్నిమాపక వాహనాలు, 20 మంది అధికారులు, 60 మంది శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో విధుల్లో నియమించారు. అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారులు శంకర్ రావు, మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో భద్రతా చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.