ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రిపై రద్దీ కొనసాగుతోంది. అమ్మవారి నామస్మరణతో కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వాలంటీర్లు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తుండగా, రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్ బృందాలు సేవలందిస్తున్నాయి. వైద్య బృందాలు ప్రాథమిక చికిత్స అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వివిధ శాఖల సేవలను సమన్వయం చేస్తోంది. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆధ్వర్యంలో పోలీసులు భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర ఆధ్వర్యంలో పారిశుధ్యం, పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమన్వయంతో సేవలందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.