పుంగనూరు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడ, మేజర్ న్యూస్: పుంగనూరులో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని, వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు, కత్తులు, మద్యం సీసాలతో కూడిన కాన్వాయ్ను వినియోగించినట్లు ఆరోపిస్తూ, ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయని తెలిపారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి నుంచి నామినేషన్ పత్రాన్ని లాక్కున్నారని ఆరోపించారు. పుంగనూరులో టీడీపీ శ్రేణులు ఎదురైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాయని, తమ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా నిర్వహించగలదని, విజయవాడలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు వెల్లడించారు. వార్డుల కేటాయింపుపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చర్చిస్తున్నారని, సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని చెప్పారు. విజయవాడలో కూటమి పార్టీల మధ్య పూర్తి సమన్వయం, సఖ్యత ఉన్నాయని, పరస్పర చర్చలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నామని బొండా ఉమా పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, దేవరపు మాల్యాద్రి పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.