గూడూరులో కాంగ్రెస్‌లోకి చేరికలు- ఇన్‌ఛార్జి భీమవరపు నరసయ్య
గూడూరు: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు వేగం పుంజుకున్నాయి. గూడూరు పట్టణంలోని గమళ్లపాలేనికి చెందిన ఎ. అంకయ్య, కుడుముల నాగరాజు గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి భీమవరపు నరసయ్య , పట్టణ అధ్యక్షుడు ఎండి. గౌస్ భాష తదితరులు వీరిద్దరికీ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానించారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పర్వతాల శీను గౌడ్ ప్రోత్సాహంతో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున ప్రతి ఒక్కరూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. కొత్తగా చేరిన వారితో పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్తూ కాంగ్రెస్ విజయానికి పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు