*ఎం.జె.పి.ఏ.పి.బి.సి.డబ్ల్యూ.ఆర్. బాలికల పాఠశాల, ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్*
విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లా, గంట్యాడ మండలంలోని ఎం.జె.పి.ఏ.పి.బి.సి.డబ్ల్యూ.ఆర్. బాలికల పాఠశాల మరియు ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, వసతి గృహాల పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, భోజన నాణ్యత, ఆహార మెనూ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలు, విద్యా సంబంధిత అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా మరియు సంక్షేమ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వసతి గృహాల్లో మెరుగైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, అవసరమైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలియజేశారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమం మరియు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు.