భోగాపురం ప్రత్యేక అధికారిగా వెంకటేశ్వరరావు
భోగాపురం, సెప్టెంబర్ 25, (మేజర్ న్యూస్):
మండల పరిషత్ పాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎంపీపీ పదవీకాలం ముగియడంతో భోగాపురం మండల పరిషత్ పరిపాలనా బాధ్యతలను ప్రత్యేక అధికారి ఎన్. వెంకటేశ్వరరావు శుక్రవారం అధికారికంగా స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న ఎన్. వెంకటేశ్వరరావుకే తాజాగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియడంతో ఈ పరిపాలనా మార్పు చోటుచేసుకుంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో కె. గాయత్రి ప్రత్యేక అధికారికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు ఏ.వి. కామేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ కొమ్మూరి చిన్నారావుతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.