భారీ వర్షాలకు కూలిన ఇల్లు
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తక్షణ సాయం
ఎల్.కోట, సెప్టెంబర్ 25:
గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్.కోట మండలంలోని రంగరాయపురం గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన చెలికాని చిన్న అప్పారావుకు చెందిన పెంకుటిల్లు భారీ వర్షాల ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబం నిరాశ్రయంగా మారింది.
విషయం ఎల్ కోట తహసీల్దార్ కార్యాలయం ద్వారా తెలుసుకున్న శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వెంటనే రంగరాయపురం గ్రామానికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కూలిపోయిన ఇంటిని పరిశీలించిన అనంతరం బాధితుడు చిన్న అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే తన చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.5,000 నగదు, నిత్యావసర సరుకులను తక్షణ సహాయంగా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావంతో వర్షాలకు నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం త్వరగా అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోతహసీల్దార్ పి హరి డి టి రమేష్ ఇతర ప్రభుత్వ అధికారులు మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు ఇతర , కూటమి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.