భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ రేసులో మెంటే దేవి.. ఎమ్మెల్యే, జనసేన జిల్లా అధ్యక్షుడికి బయోడేటా కూటమి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు.. పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యం
భీమవరం, సూర్య న్యూస్: భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ పదవికి జనసేన పార్టీ తరఫున, కూటమి మద్దతుతో పోటీ చేసేందుకు మెంటే వీర వెంకట రామ బ్రహ్మరాంబ దేవి (మెంటే దేవి) ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), జనసేన ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరాజును కలిసి తన బయోడేటాను అందజేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని వారు తెలిపినట్లు సమాచారం.మెంటే దేవి బీకాం పట్టభద్రురాలు. మాజీ ఎంపీ, నేషనల్ ఫ్రంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వర్గీయ మెంటే పద్మనాభం కోడలిగా, భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ, కరస్పాండెంట్ మెంటే రామ్ మనోహర్ సతీమణిగా ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పసల కనకసుందరం కుటుంబంతోనూ ఆమెకు సంబంధం ఉంది.ఈ సందర్భంగా మెంటే దేవి మాట్లాడుతూ భీమవరం పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధితో పాటు మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కూటమి నాయకత్వం తనకు అవకాశం కల్పిస్తే పట్టణాభివృద్ధికి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.