బడిబయట పిల్లల గురించి పట్టించుకునేవారేరి
బడి బయట పిల్లల గురించి పట్టించుకునే వారేరి --ఆత్మకూరులో చెత్త కాగితాలు, ప్లాస్టిక్ ల సేకరణలో చిన్నారులు ఆత్మకూరు, మేజర్ న్యూస్: 14 సంవత్సరాల లోపు పిల్లలు విద్యాభ్యాసం చేయకుండా బడి బయట ఉండరాదని బడి మానేసి డ్రాప్ ఔట్లుగా ఉండకూడదని, బాల కార్మికులుగా ఉండరాదని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, అందుకు తగిన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా ఇంకా పలువురు చిన్నారులు ఆత్మకూరులో బడిబయట కనిపిస్తున్నారు. ఆత్మకూరులో తరచూ పరిశీలిస్తుంటే సోమశిల రోడ్డు మార్గాన, బైపాస్ రోడ్డు మార్గాన 10 ఏళ్లలోపు చిన్నారులు చెత్త కాగితాలు, ఖాళీ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తూ కనిపిస్తుంటారు. ఇటీవల ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద మంత్రి కార్యక్రమం జరుగుతుంటే వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ఉండగానే అక్కడే నలుగురు చిన్నారులు ప్లాస్టిక్ వస్తువులు ఖాళీ వాటర్ బాటిల్స్ చెత్త కాగితాలను సేకరిస్తుండగా పట్టించుకున్న వారే లేరు. వారిని బడికి వెళుతున్నారా అని ఆడిగినా, లేదా అని ప్రశ్నించినా,ఫోటోలు తీయబోయినా పరుగులు పెడుతుంటారు.ఏడాది విద్యాసంస్థల ఆరంభంలో వేసవి సెలవులు అనంతరం ఉపాధ్యాయులు ప్రత్యేకంగా యత్నించి బడి ఈడు చిన్నారులను పాఠశాలలో చేర్పించామని చెబుతుండేవారు. కానీ ఉన్నతాధికారులు ఏడాది క్రితం అధికారికంగా జిల్లాలో 37 మండలాల్లో 1364 మంది డ్రాపవుట్స్ ఉన్నారని ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో 155 మంది, అనంతసాగరం మండలంలో 126 మంది, మర్రిపాడు మండలంలో 148 మంది, చేజర్ల మండలంలో 25 మంది, సంఘం మండలంలో 177 మంది, ఏఎస్పేట మండలంలో 88 మంది, మొత్తం 899 మంది ఉన్నారని అధికారికంగా పేర్కొంటూ తగు చర్యలు తీసుకోవాలని ఆయా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అధికారికంగానే ఇంతమంది ఉన్నారంటే వాస్తవంగా ఇంకా అధికంగా ఉంటారని భావించాల్సి ఉంటుంది. సమాజంలో బడి మానేసి బడి బయట 14 సంవత్సరాల లోపు వారు ఉండకుండేలా అలాంటి వారిని గుర్తించాలని, వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి రప్పించాలని ప్రభుత్వాలు భావిస్తూ ఆమేరకు ఆయా శాఖల అధికారులు ఉపాధ్యాయులకు సూచించడంతోపాటు మళ్లీ బడికి, పోదాం బడికి, బడిబాట,తదితర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.అయినా సంపూర్ణంగా మార్పు కానరావడం లేదు. గత ఏడాది జిల్లాలో బడిలో లేని 14633 మంది ఉన్నారని అందులో ఆత్మకూరు మండలానికి సంబంధించి పాఠశాల వారీగా పిల్లల పేర్లతో సహా 254 మంది ఉన్నారంటూ 33 పేజీలు జాబితాను అన్ని మండలాలకు ఉన్నతాధికారులు పంపారు. అయితే వారంతా బడి మానేసి కాదని ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఇతర రాష్ట్రాలలో చదువుతున్నవారు, వివరాలు తెలియని వారు ఉన్నారని కూడా అందులో నమోదు చేస్తూ వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి నివేదించాలంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు మండలాలు అధికారులు విచారించి నివేదించారని తెలుస్తోంది. దాంతో జిల్లాలో 899 మందిగా నిర్ధారించారు. అయితే ఇంకా చెత్త కాగితాలు సేకరిస్తూ అధికారులకు కూడా కనిపిస్తున్నా ఎవరు అలాంటి వారి గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. బడి మానేసిన పిల్లల్ని బడికి రప్పించేందుకు తగిన విధంగా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు ప్రయత్నించాల్సి ఉంది. బాల కార్మికులు ఉంటే విద్యా, రెవెన్యూ,పోలీస్ శాఖలు గుర్తించి బాల కార్మిక వ్యవస్థ నిరోధక చట్టాల ద్వారా కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. బడిబయట ఉన్న వారిని మాత్రం తప్పకుండా ఏదో ఒక పాఠశాలకు రప్పించేలా మాత్రం యత్నించాల్సి ఉంది. గతంలో బడి మానేసిన పిల్లలు 14 సంవత్సరాల లోపు వారిని తప్పకుండా చదివించాల్సిన తప్పనిసరి విధానం అమలు చేస్తూ రెసిడెన్సియల్,నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్స్ సెంటర్లు కూడా నిర్వహించారు,విరివిగా అందుబాటులో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను కూడా ప్రారంభించారు, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నామని అందుకు నెల్లూరు జిల్లాలో 42 కేంద్రాలను ప్రతిపాదించామని 42 మంది వాలంటీర్లు నియమిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మకూరు మండలంలోని గ్రామాల్లో బడి మానేసిన పిల్లల విషయమై సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోడ్లపై చిత్తు కాగితాలు సేకరించేవారు అధికారులకు కనిపించడం లేదా కాస్తంత నిఘా ఉంచితే కనిపిస్తారు అంటున్నారు.వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమన్వయం చేసి బడికి రప్పించాలి కదా అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.