'అర్నబ్' అల్లకల్లోలం.. గాజువాక అతలాకుతలం
- నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు.. స్తంభించిన రాకపోకలు
- కుప్పకూలిన పాఠశాల ప్రహరీ గోడ
- తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం
జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. బిక్కుబిక్కుమంటున్న జనం
గాజువాక, సూర్య: 'అర్నబ్' తుఫాను గాజువాకపై పంజా విసిరింది. తీవ్ర రూపం దాల్చిన ఈ విపత్తు నగరంతో పాటు పరిసర ప్రాంతాలపై విలయతాండవం చేస్తోంది. భయానకంగా వీస్తున్న ఈదురు గాలులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. గాలుల తీవ్రతకు నగరంలోని పలుచోట్ల దశాబ్దాల నాటి భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకిలించుకుని నేలకొరిగాయి. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే షీలానగర్ జాతీయ రహదారికి అడ్డంగా ఓ భారీ వృక్షం కూలిపోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అటు గాజువాక, పెదగంట్యాడ ఫైర్ స్టేషన్ సమీపంలోనూ రోడ్డుపైకి చెట్లు విరిగిపడటంతో ఆయా మార్గాల్లో ప్రయాణం అత్యంత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఈదురు గాలుల బీభత్సానికి గొంతువానిపాలెం సమీపంలో ఓ భారీ వృక్షం కూలిపోయి, అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడపై పడటంతో అది పూర్తిగా కుప్పకూలింది. అదేవిధంగా, ఆగనంపూడి 104వ వార్డు పరిధిలోనూ తుఫాను తీవ్రతకు భారీ నష్టం వాటిల్లింది. చినపాలెం నుంచి పెదపాలెం వెళ్లే రహదారిలో వీచిన బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలతో పాటు ఏకంగా నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడిపోయాయి. అయితే, వర్షం మొదలైన వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్ సరఫరాలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఇక కుండపోత వర్షాలకు గాజువాకలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉక్కునగరం వెళ్లే మార్గంలోని దుర్గా నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో, ఆ మార్గం గుండా ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. పరిస్థితిని గమనించిన అధికారులు అప్రమత్తమై.. వాహనదారులను హెచ్చరిస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు. ఇళ్ల చుట్టూ, ప్రధాన రహదారులపైకి వరద నీరు పోటెత్తడంతో స్థానికులు అడుగడుగునా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి తోడు, గాలుల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.