అన్నమయ్య జిల్లా పోలీసు దళంలోకి ‘తార’.. నేరస్తుల గుర్తింపులో కీలక పాత్ర!
అన్నమయ్య జిల్లా పోలీసు దళంలోకి ‘తార’.. నేరస్తుల గుర్తింపులో కీలక పాత్ర!
పేలుడు పదార్థాల గుర్తింపు, నేరస్తుల జాడ కనిపెట్టడంలో ప్రత్యేక శిక్షణ
మదనపల్లె, అన్నమయ్య జిల్లా: నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడికి అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలోకి బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ‘తార’ అనే ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం చేరింది. మంగళగిరిలో 11 నెలల పాటు కఠిన శిక్షణ పొందిన ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంతో పాటు వాసన ఆధారంగా నేరస్తుల జాడను కనిపెట్టడంలో నైపుణ్యం సాధించింది.
జిల్లా పోలీసు శాఖలో భాగంగా చేరిన ‘తార’ను ఆర్ఐ యు. రంగనాథ్ బాబు, ఏఆర్ఎస్ఐ ఎస్. వేణుగోపాల్ ఆధ్వర్యంలో హ్యాండ్లర్లు సి. సుబ్బరామరాజు, బి. ప్రసాద్ నాయక్ సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఎదుట ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లతో పాటు అవసరమైన పోలీసు తనిఖీల్లో ‘తార’ సేవలను వినియోగించనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణ, అనుమానాస్పద వస్తువుల గుర్తింపు, నేరస్తుల ఆచూకీ కనుగొనడంలో ఈ జాగిలం సేవలు పోలీసు శాఖకు ఉపయోగపడనున్నాయి.