అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం;పరిశుభ్రంగా మార్చిన ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. పారిశుధ్య పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం ఉదయం నారాయణపురం పరిసర ప్రాంతంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. పలుచోట్ల వీధులు అపరిశుభ్రంగా ఉండటం, రోడ్ల వెంబడి చెత్త కుప్పలు పేరుకుపోవటంతో శానిటరీ సెక్రటరీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారని, అలాంటి కృషిని వృథా చేసేలా ప్రవర్తించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికీ చాలా చోట్ల రోడ్ల వెంబడి కొబ్బరిబోండాలు, బిల్డింగ్ నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర షాపుల యజమానులు తప్పనిసరిగా చెత్త బుట్టలు పెట్టుకోవాలని సూచించారు. అలాగే ఖాళీ స్థలాలను యజమానులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ప్లాట్ లలో పిచ్చి మొక్కలు, చెత్తను వెంటనే తొలగించాలన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని.. కనుక చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందజేసి, స్వచ్ఛ రాజమహేంద్రవరం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఇతర పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.