350 మందితో భారీ ర్యాలీ.. టీడీపీ అభ్యర్థికి నాయకుల మద్దతు
పొదలకూరు, మేజర్ న్యూస్ : మండలంలోని ఆర్.వై పాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా మైలా. కోటేశ్వరరావు శుక్రవారం భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. కలువాయి రోడ్డు నుంచి సుమారు 350 మంది కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కేంద్రానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పులిపాటి వెంకటరత్నం నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పొదలకూరు అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా పొదలకూరుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన నాయకుడు సోమిరెడ్డి అని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి, మెగా మినరల్ వాటర్ ప్లాంట్, సోమశిల దక్షిణ కాలువ, కండలేరు ఎడమ కాలువకు లిఫ్ట్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే పనులకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సీ .ఎస్ .ఆర్ ఫండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ,సైకిళ్ల పంపిణీ ,మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ ,అలాగే నుడా నిధులతో పొదలకూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు ఇలా అభివృద్ధికి మారుపేరుగా నిలిచారని పేర్కొన్నారు .ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలు టీడీపీ,కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.