|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:39 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పైలట్ సర్వేలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అతి చిన్న మండలమైన మావలలో నిర్వహించిన సామాజిక తనిఖీలో ఏకంగా 9 మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన మావల మండలంలో సామాజిక తనిఖీ నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఐదుగురు అధికారుల బృందం వచ్చింది. ఈ బృందం లబ్ధిదారుల జాబితాతో ఇంటింటికి తిరిగి విచారణ చేపట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల అర్హతలను క్షుణ్ణంగా పోల్చి చూశారు. కేవలం 650 మంది లబ్ధిదారులు మాత్రమే ఉన్న చిన్న మండలమైన మావలలోనే 9 మంది అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. ఈ ఫలితాలతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్వే చేస్తే.. మరిన్ని అక్రమాలు, ఎక్కువ సంఖ్యలో అనర్హులు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద మొత్తం 73,717 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతినెలా వీరికి రూ. 16.22 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వంటి వారికి నెలకు రూ. 2,016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున పింఛన్ చెల్లిస్తున్నారు. అయితే, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పింఛన్‌కు అర్హత పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1.50 లక్షలు లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు. కుటుంబానికి 7.5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉండాలి.
కానీ సర్వేలో తేలిన విషయం ఏంటంటే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి తల్లిదండ్రులు సైతం ఈ పింఛన్లు పొందుతున్నట్లు స్పష్టమైంది. ఈ విధంగా అర్హత ప్రమాణాలు పాటించని 9 మందిని మావల మండలంలో గుర్తించి, అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనర్హులుగా తేలిన వారి పింఛన్లను వెంటనే నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల ద్వారా నిజమైన పేదలు, అవసరం ఉన్నవారు మాత్రమే లబ్ధి పొందేలా పథకం అమలును పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.