|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 08:08 PM
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత పెను సంచలనంగా మారారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత.. ఆ పార్టీలోని కొందరు నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేయనున్నట్లు ప్రకటించిన కల్వకుంట్ల కవిత.. తెలంగాణ జాగృతి పేరుతో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్వకుంట్ల కవిత.. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు.
అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించనున్న ఈ యాత్రలో భాగంగా తెలంగాణ మొత్తం 33 జిల్లాల మీదుగా కొనసాగేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్రను నిర్వహించాలని కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. ఇక ఈ యాత్రలో తన ఫోటోతోపాటు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోను.. యాత్ర పోస్టర్లలో డిజైన్ చేయాలని తెలంగాణ జాగృతి శ్రేణులకు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి.. సొంతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఫోటో ఉంటే.. తమ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఫోటో లేకుండా ఈ యాత్రను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ మేధావులు, విద్యావంతులతో గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత వరుసగా భేటీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పోరాటాలు చేసి.. ఇప్పుడు ఎవరూ పట్టించుకోకుండా ఉండే వారిని కల్వకుంట్ల కవిత కలవనున్నారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యావంతులు, సామాజిక వేత్తలతోనూ కవిత ముచ్చటించనున్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం, బీసీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగానే తెలంగాణ జాగృతి పనిచేస్తుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల ముందు బట్టబయలు చేస్తామని తేల్చి చెప్పారు.