తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాంః మంత్రి పొన్నం
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల (నాంపల్లి, జూబ్లీహిల్స్) తుర్కపల్లి ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించి జాతీయస్థాయి క్రీడాకారులకు అందించారు. అనంతరం వాలీబాల్ పోటీలను ప్రారంభించి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థి జీవితంలో అంతర్భాగమని, క్రీడల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన 'ఖేలో ఇండియా' క్రీడా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోందని, తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు వందల సంఖ్యలో బంగారు పతకాలు సాధిస్తున్నాయని, మన దేశ క్రీడాకారులు కూడా ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గురుకుల విద్యార్థుల చదువు, శారీరక దృఢత్వం, పౌష్టికాహారంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్ ఛార్జీలను 40 శాతం పెంచామని తెలిపారు. గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు గురుకులాలకు ప్రారంభంలోనే సొంత భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించి ఉంటే నేడు నెలకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు అద్దెల భారం పడేది కాదని అన్నారు. విద్యార్థులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచించినట్లుగా గొప్ప కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఆలోచనలు, తెలివితేటలు ఎవరి సొత్తు కాదని, ప్రతి విద్యార్థి పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థి దశ జీవితంలో మళ్లీ తిరిగిరాదని, ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి గర్వకారణంగా నిలిచేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ యువత చదువుతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడల్లో విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీతత్వంతో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే చదువుతో పాటు డీఎస్పీ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని జ్యోతిబా ఫూలే గురుకులాల్లో సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులపై ఉందన్నారు. ఆచార్య దేవోభవ' స్ఫూర్తితో ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి సైదులు, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీషా రెడ్డి, వజ్రేష్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.