telangana
పోలీస్ స్టేషన్ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన
సూర్య బాల్కొండ / ముప్కాల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ముప్కాల్ పోలీసులు పోలీస్ శాఖ పనితీరు, పోలీస్ స్టేషన్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ జాన్ రెడ్డి, ఎస్సై కిరణ్ పాల్ విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, పోలీస్ స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను వివరించారు. అత్యవసర సమయాల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి, ప్రజల భద్రత కోసం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాలపై అవగాహన కల్పించారు.అనంతరం విద్యార్థులు పోలీస్ శాఖకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమాజ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. విద్యార్థులు దేశభక్తి భావనను పెంపొందించుకోవడంతో పాటు చట్టాలపై గౌరవం కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.