మియాపూర్ భూముల కేసులో తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు న్యాయపోరాటం చేసి విజయం సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మియాపూర్ భూముల కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని దయాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఒక్క ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో నిపుణులైన న్యాయవాదులతో బలమైన వాదనలు వినిపిస్తూ న్యాయపోరాటం చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల విషయంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్, పార్థసారథితో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ట్రినిటీ డెవలప్మెంట్ పేరుతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం పేరును ఉపయోగించి హెచ్‌యూడీఏ కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. 23 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ కేసులో విజయం సాధించడం ప్రభుత్వ విజయంగా చూడాలని దయాకర్ అన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని, ఇంతటి విలువైన ఆస్తులను కాపాడిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.
అలాగే గచ్చిబౌలిలోని 400 ఎకరాలు, ఐఎంజీ అకాడమీస్‌కు సంబంధించిన సుమారు 850 ఎకరాల భూముల వ్యవహారంలోనూ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందన్నారు. 2024 మే 3న సుప్రీంకోర్టు ఐఎంజీ సంస్థ పిటిషన్‌ను కొట్టివేసిందని గుర్తుచేశారు. ఈ పరిణామాలతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు పరిరక్షణలోకి వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో భూ ఆక్రమణలకు పాల్పడుతూ, దోపిడీదారులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు ప్రయత్నించిందని దయాకర్ తీవ్రంగా విమర్శించారు. మియాపూర్ భూముల విషయంలో కేటీఆర్ సవాళ్లు విసరడం కాదని, అసలు భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో ఎందుకు సంబంధాలు కొనసాగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ట్రినిటీ ఇన్ఫ్రా లిమిటెడ్‌తో జరిగిన లావాదేవీలు, 6,666 కార్ల కొనుగోలు వ్యవహారంపై కూడా కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని చనగాని డిమాండ్ చేశారు.
ఎ.రవీందర్ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి