కొత్తగూడెం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి-పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు
పరకాల, మేజర్ న్యూస్, కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రచారంలో ఉన్న నిరసన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రతిరూపాలను రావణాసురుడి ప్రతిమపై ఏర్పాటు చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షుడు గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా గాజుల నిరంజన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే నిరసన కార్యక్రమాలు చట్టపరిధిలో జరగాలని పేర్కొన్నారు. కొత్తగూడెం ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని పోలీసులను కోరారు.ఈ ఘటనలో పాల్గొన్న వారి పాత్రపై విచారణ జరిపి, చట్ట ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, జిల్లా నాయకులు బాసాని సోమరాజు, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కక్కు రాజు, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా