ఇవి తాగే నీళ్లేనా?..
వెంగళరావునగర్, మేజర్ న్యూస్:అది జలం కాదు, గరళం. ప్రజలు తాగాల్సిన మంచినీరు కాదు..డ్రైనేజీల్లో పారే మురుగునీరు... ప్రజల దాహార్తిని తీర్చాల్సిన తాగునీరు కలుషితమై రోగాలకు కారణమవుతుండటంతో మధురానగర్ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ 'ఈ' బ్లాక్‌లో కొంతకాలంగా కలుషిత నీరు సరఫరా అవుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాలనీలోని తాగునీటి సరఫరా పైపులైన్లలోకి డ్రైనేజీ నీరు చేరుతుండటంతో మురుగునీరు కలిసిన జలమే ఇళ్లకు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని వినియోగించి, తాగిన పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలలుగా సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వాపోతున్నారు.
ఫిర్యాదులు చేసినా.. ఫలితం శూన్యం
ఈ సమస్యపై బాధితులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారులు వచ్చి అక్కడక్కడా నామమాత్రపు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోతున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని పేర్కొంటున్నారు.
ముందుగా డీసిల్టింగ్ చేపట్టాలి
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ పైపులైన్ల డీసిల్టింగ్ చేపట్టాలని, తాగునీటి పైపుల్లోకి మురుగునీరు చేరుతున్న ప్రాంతాలను గుర్తించి లీకేజీలను పూర్తిస్థాయిలో అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాగునీటి నమూనాలను పరీక్షించి, సురక్షితమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఏదీ?
ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మన్నె కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రజలు కలుషిత నీటితో ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని ఆరోపించారు. సమస్య తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మధురానగర్ 'ఈ' బ్లాక్‌లో కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.