డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ స్పష్టీకరణ.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లొంక నర్సింలు పేరు సిఫారసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి వస్తున్న వార్తా కథనాలపై వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించిందని, నూతన మండల అధ్యక్షుడిగా లొంక నర్సింలు పేరును సిఫారసు చేస్తూ అధిష్టానానికి ప్రతిపాదన పంపించినట్లు ఆయన వెల్లడించారు.పార్టీ నిబంధనల ప్రకారం టీపీసీసీ నామినేటెడ్ విధానంలో సహకార సంఘాల పదవులు, పార్టీ కమిటీల్లో పదవులు పొందే విషయంలో ఒక వ్యక్తికి ఒకే పదవి కేటాయించాలనే నిబంధన ఉందని జాదవ్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలతో మహిపాల్ రెడ్డి పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానం ఆమోదించిందని స్పష్టం చేశారు.అదేవిధంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచన మేరకు పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష పదవికి లొంక నర్సింలు పేరును ప్రతిపాదిస్తూ నియామక సిఫారసు లేఖను పార్టీ అధిష్టానానికి పంపించినట్లు డీసీసీ అధ్యక్షుడు వెల్లడించారు. నూతన మండల అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుందని తెలిపారు.మండల పార్టీ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న సందిగ్ధతకు స్పష్టత లభించింది. అయితే, లొంక నర్సింలు నియామకంపై పార్టీ అధిష్టానం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.