వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు పెంపునకు.... రాజకీయ పార్టీలు సహకరించాలి----జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.గురువారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు, సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇంకా 2,195 మంది ఓటర్లకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన పెండింగ్లో ఉందని, వాటిని ఇంటింటికీ వెళ్లి పరిశీలించి శుక్రవారం నాటికి పూర్తి చేయాలని తహసీల్దార్లు, బీఎల్ఓలను ఆదేశించినట్లు తెలిపారు.ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఓటరు జాబితా నుండి తొలగించబడిన వారు తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ శిబిరాల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, అలాగే బూత్ లెవల్ ఏజెంట్లు సైతం శిబిరాలలో పాల్గొని సహకరించాలని కోరారు.
ఓటర్ల తొలగింపు విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, నోటీసులు, బీఎల్ఏ నివేదిక తదితర ప్రక్రియలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు .పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయిలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, కాంగ్రెస్ పార్టీ తరఫున ముంతాజ్ ఆలీ, టిఆర్ఎస్ నుండి బక్క పిచ్చయ్య, అమ్ ఆద్మీ పార్టీ నుండి అన్సారి, బిజెపి తరఫున లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, టిడిపి నుండి తేలు అన్న రవి, అద్దంకి రవీందర్ , తదితరులు హాజరయ్యారు.