రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత , స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి- జిల్లా కలెక్టర్ హిమంత కేశవ్ పాటిల్
రక్తదానం ఒక మహత్తర సామాజిక బాధ్యత అని మనం చేసే రక్తదానం ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాలను కాపాడేందుకు ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారుజాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యువత, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందించేందుకు తగిన రక్త నిల్వలు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, వైద్యుల సూచనలు మరియు నిర్దేశిత ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా అర్హులైన వారు రక్తదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒక్కసారి రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రఫిక్, డాక్టర్ రోహిత్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.
పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్