గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
--గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
--అర్హులైన పట్టభద్రులు వెంటనే నమోదు చేసుకోవాలి
---జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
2027 మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గాల) నేపథ్యంలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు.వచ్చే నెల నవంబరు 6వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని, ఈ ఏడాది నవంబరు 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదుకు అర్హులని పేర్కొన్నారు.
పట్టభద్రులైన యువత, ఉద్యోగులు, విద్యావంతులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే జాబితాలో పేరు ఉన్నవారు సైతం కొత్తగా ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ (సి.ఈ.ఓ తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా) నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో పట్టభద్రులకు అవగాహన కల్పించాలని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు.