telanagana
ఎస్పీఎం పన్నులపై పునఃసమీక్ష చేపట్టాలి
సూర్య,కాగజ్నగర్ :కాగజ్నగర్ మున్సిపాలిటీ ఆదాయం పెంచేందుకు ఎస్పీఎం పరిశ్రమకు సంబంధించిన పన్నులపై పునఃసమీక్ష చేపట్టి, నిబంధనల ప్రకారం పన్ను విధించాలని 26వ వార్డు కౌన్సిలర్ వసీం ఉన్నీసా కోరారు. గురువారం మున్సిపాలిటీలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గతంలో ఎస్పీఎం యాజమాన్యం మున్సిపాలిటీకి ఏటా సుమారు రూ.1.20 కోట్ల పన్ను చెల్లించేదని, అయితే గత( టీ )బీ ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమయంలో ఈ పన్ను రూ.50 లక్షలకు తగ్గినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.మున్సిపాలిటీ ఆదాయం తగ్గడం వల్ల కార్మికులకు జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బకాయిలు సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీఎం పరిశ్రమకు సంబంధించిన ఆస్తులపై పునఃసర్వే నిర్వహించి, పన్ను విధింపు వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన పన్ను విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం సమకూరితే కార్మికుల జీతభత్యాలు, పీఎఫ్ బకాయిల చెల్లింపులతో పాటు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వసీం ఉన్నీసా పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.