సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం చేపట్టిన భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో భూ భారతి పోర్టల్లోని పాస్బుక్ డేటా సవరణ సేవపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోర్టల్లో పాస్బుక్ డేటా సవరణకు సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు, జీ.ఓ. నంబర్ 59, 76 లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన క్షేత్రస్థాయి విచారణలు, పరిశీలనలు పూర్తి చేసి, సంబంధిత రికార్డులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు, దరఖాస్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హమైన దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, క్షేత్రస్థాయి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్పాండే, బి సూపరింటెండెంట్, డి సూపరింటెండెంట్, ఎఫ్ సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.