ఎస్ఐఆర్ పై అపోహలు సృష్టించడం సరికాదు..!
బీజేపీ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డివికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10): ఎస్ఐఆర్ ప్రక్రియపై అపోహలు సృష్టించడం సరికాదని, దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ ప్రస్తుత పరిస్థితులపై బాధ్యతాయుతంగా ఆలోచించాలని బీజేపీ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు టి.సదానంద రెడ్డి అన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..., ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దాలని, అంతేకానీ మొత్తం ప్రక్రియనే వ్యతిరేకించడం సమంజసం కాదని పేర్కొన్నారు. అర్హులైన పౌరుల ఓటు హక్కు తొలగిపోకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనర్హంగా ఓట్లు తొలగించినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే, బాధితులకు తమ ఓటు హక్కును తిరిగి పొందే అవకాశం కల్పించాలని అన్నారు. పట్టణ వార్డులు, గ్రామాల స్థాయిలో అర్హులైన ఓటర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాల్లో మార్పులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచుతూ, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అయితే ఆ హక్కును శాంతియుతంగా, చట్టపరిధిలో వినియోగించుకోవాలని సదానంద రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, అనవసర ఉద్రిక్తతలకు కారణమయ్యే విధంగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. చర్చలు, ఆధారాలు, చట్టపరమైన పోరాటాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలపై అభ్యంతరాలు ఉన్న రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మధ్యకు వెళ్లి తమ అభిప్రాయాలను వివరించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు పొందడం, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో ఉన్న మార్గాలని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు. దేశ ఐక్యత, శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సదానంద రెడ్డి పిలుపునిచ్చారు.