చట్టాలపై అవగాహన పెంచుకోవాలి -న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక
చట్టాలపై అవగాహన పెంచుకొని ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక అన్నారు.రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో చైల్డ్ మ్యారేజెస్ , చైల్డ్ లేబర్ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు అంటే నిర్ణీత చట్టపరమైన వయస్సు రాకముందే అమ్మాయిలకు వివాహాలు చేయడమని అన్నారు. చట్ట పరంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలని అప్పుడు చట్టబద్ధ వివాహం అవుతుందన్నారు. అమ్మాయిలకు బాల్య వివాహం చేయడం వల్ల వారు చిన్న వయసులోనే తల్లులు అయ్యి పుట్టబోయే పిల్లలకు ప్రాణాపాయం , తీవ్ర అనారోగ్యం కలుగుతుందన్నారు. 18 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న పిల్లల చేత పనులు చేయిస్తే , ఆ పనులు పిల్లల మానసిక , శారీరక మరియు నైతిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయన్నారు. పిల్లల చేత పనులు చేయించడం చట్ట పరంగా నేరం, వారిచే పనులు చేయించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటారన్నారు. బాల్య వివాహాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు ఫోన్ చేసి వారి సేవలు ఉపయోగించుకోవాలి అన్నారు . కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ రామ్ ఆర్య , డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీశైలం గౌడ్ , సర్పంచ్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్