ఢిల్లీలో కాలుష్య నియంత్రణ దూకుడు: తొలిరోజే రూ.68 లక్షల జరిమానా, 1500కు పైగా వాహనాలు వెనక్కి
సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు వింటర్ యాక్షన్ ప్లాన్ అమల్లోకి వచ్చిన తొలి రోజే అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. శీతాకాల కాలుష్య నియంత్రణ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ఏకంగా రూ.68.4 లక్షల జరిమానాలు, పర్యావరణ పరిహార రుసుములను విధించారు. కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 1,539 వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేసి వెనక్కి పంపించివేశారు.
నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద దాదాపు 15,000 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వెనక్కి పంపిన వాహనాల్లో 140 లైట్ మోటార్ వెహికల్స్, 54 తేలికపాటి వాణిజ్య వాహనాలు, 95 భారీ సరుకు రవాణా వాహనాలు మరియు 34 బస్సులు ఉన్నాయి. నిబంధనలు పాటించని వాహనదారులకు 127 చలానాలు జారీ చేయడంతో పాటు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 62 వాహనాలను అధికారులు సీజ్ చేశారు.
కాలుష్య తీవ్రతను తగ్గించే చర్యల్లో భాగంగా నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో భౌతిక హాజరును 50 శాతానికి పరిమితం చేయాలని, మిగిలిన 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే నిత్యావసర, అత్యవసర సేవలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. కాలుష్య నివారణ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలు, నిర్మాణ ప్రాంతాలపై రాబోయే రోజుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.