వియత్నాం చేరుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. హనోయ్‌లో అగ్రనేతలతో ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలు!
సూర్య అంతర్జాతీయ బ్యూరో, హనోయ్/న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధికారిక పర్యటన నిమిత్తం వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత మరియు వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన ఈ కీలక పర్యటన చేపట్టారు. హనోయ్ చేరుకున్న దోవల్‌కు వియత్నాం ప్రభుత్వ ప్రతినిధులు, భారత రాయబార కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వియత్నాం అగ్ర నాయకత్వంతో పాటు భద్రతా ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఈ పర్యటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధికారిక పర్యటన నిమిత్తం హనోయ్‌లో అడుగుపెట్టారు. భారత్-వియత్నాం మధ్య గల ‘ఎన్‌హాన్స్‌డ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్’ (సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం) కార్యాచరణను సమీక్షించేందుకు ఆయన వియత్నాం నాయకత్వంతో భేటీ అవుతారు" అని వెల్లడించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర జలాల్లో రవాణా స్వేచ్ఛ, ఉమ్మడి రక్షణ పరిశోధనలు మరియు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి అంశాలపై ఈ భేటీల్లో ప్రధానంగా చర్చించనున్నారు.
వియత్నాం అధ్యక్షుడు తో లామ్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తమ వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అజిత్ దోవల్ తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి రక్షణ భాగస్వామ్య ఉమ్మడి విజన్ అమలు, సైనిక విన్యాసాలు, పోర్ట్ కాల్స్ మరియు సైబర్ భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా దోవల్ నేతృత్వంలోని భారత బృందం వియత్నాం రక్షణ, ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశం కానుంది.