క్యూ2 ఫలితాల జోరుతో మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్ల ర్యాలీ.. 20 శాతం పెరిగిన ఆదాయం, ₹3,219 కోట్లకు చేరిక!
సూర్య బిజినెస్ బ్యూరో, ముంబై: ప్రముఖ ఆసుపత్రుల నెట్‌వర్క్ ‘మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2)లో బలమైన ఆర్థిక పనితీరును కనబరిచింది. సంస్థ నెట్‌వర్క్ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధితో ₹3,219 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. మెరుగైన బెడ్ ఆక్యుపెన్సీ, పెరిగిన ఇన్‌పేషెంట్ సంఖ్య మరియు ఆపరేషనల్ విస్తరణలతో ఆదాయం భారీగా పెరగడంతో స్టాక్ మార్కెట్లో మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు లాభాలతో ముగిశాయి.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నెట్‌వర్క్ నికర లాభం (PAT) వార్షికంగా 10 శాతం పెరిగి ₹448 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం సైతం 18 శాతం వృద్ధితో ₹820 కోట్లుగా నమోదైంది. రోగులకు అందించే సేవల నాణ్యత, ప్రత్యేక చికిత్సలకు డిమాండ్ పెరగడంతో ఆసుపత్రుల బెడ్ ఆక్యుపెన్సీ 77 శాతంగా నమోదైంది. సంస్థ మొత్తం ఆపరేషనల్ బెడ్ల సామర్థ్యం 16 శాతం పెరిగి 5,518 పడకలకు చేరింది. రోగి సగటు రాబడి (ARPP) సైతం 8 శాతం వృద్ధితో ₹2.31 లక్షలకు పెరగడం ఆదాయ వృద్ధికి అదనపు బలాన్ని చేకూర్చింది.
మరోవైపు సంస్థ కార్యకలాపాల ద్వారా సమకూరిన ఉచిత నగదు ప్రవాహం (Free Cash from Operations) గత ఏడాది ఇదే కాలంలో నమోదైన ₹291 కోట్ల నుంచి ఏకంగా ₹500 కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్య సేవల డిమాండ్‌కు అనుగుణంగా రాబోయే 4–5 ఏళ్లలో బ్రౌన్‌ఫీల్డ్ మరియు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ద్వారా తమ మొత్తం పడకల సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసే దిశగా విస్తరణ ప్రణాళికలు వేగవంతం చేస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ సోయ్ తెలిపారు.