ఆసియాన్ నౌకాదళాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం
సూర్య జాతీయ డెస్క్: రెండో విడత ఆసియాన్ - భారత్ సముద్ర సంయుక్త విన్యాసాలు (ఏఐఎంఈ-2026) ఫిలిప్పీన్స్‌లోని సుబిక్ బే వేదికగా సెప్టెంబర్ 28న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నమ్మకమే పునాదిగా, సముద్రంలో ఐక్యంగా అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కులిశ్ యుద్ధనౌకలతో పాటు వివిధ ఆసియాన్ దేశాల నావికా దళాలు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. భారత్ మరియు ఆసియాన్ దేశాల మధ్య పరస్పర అవగాహనను, సహకారాన్ని, నౌకాదళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. రక్షణ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి హర్ష్ కుమార్ జైన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ విన్యాసాల తొలి దశ అయిన హార్బర్ ఫేస్‌లో భాగంగా పలు రకాల సాంకేతిక, వృత్తిపరమైన, కార్యాచరణ మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిపుణుల మధ్య సబ్జెక్ట్ మేటర్ చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలతో పాటు సముద్ర దశకు వెళ్లే ముందు ఆపరేషనల్ సింక్రొనైజేషన్ నిర్వహిస్తారు. దీని తర్వాత ప్రారంభమయ్యే సీ ఫేస్‌లో పాల్గొనే నౌకాదళాలు సముద్రంలో సమన్వయంతో కూడిన విన్యాసాలు, ఆపరేషనల్ సీరియల్స్‌ను చేపడతాయి. ఈ ఆచరణాత్మక శిక్షణ ద్వారా దేశాల మధ్య వృత్తిపరమైన అవగాహన, కార్యాచరణ సమన్వయం మరియు ఇంటర్‌ఆపరేబిలిటీ మరింత బలపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత నౌకాదళం ఆసియాన్ దేశాలతో సముద్ర సంబంధాలను బలోపేతం చేయడానికి, ఆచరణాత్మక సహకారాన్ని ప్రోత్సహించడానికి నిరంతరం కట్టుబడి ఉందని ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కులిశ్ నౌకల భాగస్వామ్యం స్పష్టం చేస్తోంది. భారత్ అమలు చేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ప్రాంతీయ భద్రత, వృద్ధి (మహాసాగర్) ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంయుక్త విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య సముద్ర భద్రతను పెంపొందించడంలో, సముద్ర మార్గాల్లో శాంతిభద్రతలను కాపాడుకోవడంలో ఈ తరహా సైనిక విన్యాసాలు ఎంతగానో దోహదపడతాయని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.