ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై మెటా కొత్త రూల్స్
న్యూఢిల్లీ, నవంబర్ 18:ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన కంటెంట్ రికమెండేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అశ్లీలత, హింస లేదా రెచ్చగొట్టే స్వభావం ఉన్న పోస్టులను కట్టడి చేసేందుకు మెటా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అక్టోబర్ 10న కేంద్ర ఐటీ శాఖ జారీ చేసిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది.
కొత్త అల్గారిథమ్ మార్పుల ప్రకారం.. అభ్యంతరకర కంటెంట్‌ను ఇకపై యూజర్ల ఫీడ్‌లో తక్కువగా చూపిస్తారు. ప్రధానంగా యూజర్లు ఫాలో అవ్వని అకౌంట్ల నుంచి వచ్చే రీల్స్, ఎక్స్‌ప్లోర్ సెక్షన్ కంటెంట్‌కు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కృత్రిమ మేధ (AI) సాంకేతికత సహాయంతో కంటెంట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి, వినియోగదారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని మెటా స్పష్టం చేసింది. యూజర్ల నుంచి అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సేఫ్టీ సెట్టింగ్స్‌ను కూడా అప్‌డేట్ చేసినట్లు వెల్లడించింది.