చైనా బ్యాంకింగ్ రంగంలో పెను సంక్షోభం : రికార్డు స్థాయిలో 670 బ్యాంకుల మూసివేత..
మొండి బకాయిల ఎఫెక్ట్‌తో విలీనాలు వేగవంతం
సూర్య అంతర్జాతీయ డెస్క్: చైనా ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న రియల్ ఎస్టేట్ మాంద్యం, మొండి బకాయిల (ఎన్‌పీఏ) తీవ్రత దేశ బ్యాంకింగ్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. మొండి బకాయిలు రికార్డు స్థాయికి ఎగబాకడంతో చిన్న, గ్రామీణ రుణ సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఇతర రంగాలకు పాకకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం చిన్న బ్యాంకులను విలీనం చేసే లేదా మూసివేసే ప్రక్రియను శరవేగంగా చేపట్టింది. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో ఏకంగా 670 రుణ సంస్థలు (లెండర్లు) తమ ఉనికిని కోల్పోవడమో లేదా పెద్ద బ్యాంకుల్లో విలీనం కావడమో జరిగిందని అంతర్జాతీయ ఆర్థిక నివేదికలు వెల్లడించాయి.
చైనా గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న చిన్న స్థాయి కోఆపరేటివ్ బ్యాంకులు, రూరల్ క్రెడిట్ యూనియన్లు ఎక్కువగా స్థానిక రియల్ ఎస్టేట్ డెవలపర్లకు, స్థానిక ప్రభుత్వ ప్రాజెక్టులకు భారీగా రుణాలు మంజూరు చేశాయి. అయితే, దేశంలో ప్రాపర్టీ రంగం కుదేలవడం, అమ్మకాలు పడిపోవడంతో బిల్డర్లు చేతులెత్తేశారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్థక ఆస్తులు భారీగా పెరిగిపోయాయి. మూలధన కొరతతో కుదేలవుతున్న వందలాది చిన్న బ్యాంకులను రక్షించేందుకు ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు, ప్రావిన్సుల స్థాయిలో పెద్ద ప్రాంతీయ కమర్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేసి, వాటిలో ఈ చిన్న రుణ సంస్థలను బలవంతంగా విలీనం చేస్తోంది.
ఈ చర్యల ద్వారా బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని చైనా పాలక యంత్రాంగం భావిస్తోంది. అయినప్పటికీ, చిన్న సంస్థలను విలీనం చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, మొండి బకాయిల భారం పెద్ద బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై పడి మరింత ఒత్తిడి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఆర్థిక మందగమనం, వినియోగదారుల ఖర్చులు తగ్గడం, ఎగుమతులపై ఒత్తిడి కొనసాగుతున్న వేళ బ్యాంకింగ్ రంగంలో వేగవంతమైన ఈ ప్రక్షాళన చైనా ఆర్థిక వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.