స్మార్ట్‌ఫోన్ బ్రెయిన్ ముప్పు: మీ ఫోన్ వ్యసనం మెదడును ఎలా నాశనం చేస్తోందో తెలుసా?
సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే నోటిఫికేషన్‌లు చెక్ చేయడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం మొబైల్ స్క్రీన్‌ను వీక్షించడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది మనుషుల మధ్య దూరం తగ్గి సెల్ ఫోన్లతోనే గడిపే సమయం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఈ విధంగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మెదడు పనితీరుపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతోందని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కాలక్షేపం అనుకునే ఈ డిజిటల్ అలవాటు మనుషులను అనారోగ్యాల పాలు చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికంగా స్మార్ట్‌ఫోన్‌లను వాడటం వల్ల మనుషులలో ఏకాగ్రత పూర్తిగా కొరవడుతుందని, నిద్రలేమి సమస్యలు చుట్టుముడుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకే సమయంలో అనేక పనులను చేయడానికి ప్రయత్నించడం, తరచూ ఫోన్‌లోని యాప్‌లను మారుస్తూ ఉండటం వల్ల మెదడు నెట్‌వర్క్‌లలో మార్పులు వచ్చి ఏకాగ్రత విచ్ఛిన్నమవుతుందని పరిశోధనలు తేల్చాయి. దీనివల్ల వ్యక్తి నిరంతరం పరధ్యానంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, రాత్రి సమయాల్లో స్క్రీన్ నుంచి వెలువడే కాంతి కారణంగా శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లపై ప్రభావం పడి నిద్రలేమి సమస్య తీవ్రమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రతి అదనపు గంట స్క్రీన్ సమయం మనిషి సహజమైన నిద్ర సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఫోన్ వాడకానికి, తలనొప్పికి విడదీయరాని సంబంధం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. నిరంతరం స్క్రీన్‌ను దగ్గరగా చూడటం, కనురెప్పలుార్చడం తగ్గించడం, ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చోవడం మరియు మెడను ఎక్కువ సేపు వంచి ఉంచడం వంటి అనేక శారీరక ట్రిగ్గర్‌ల వల్ల తీవ్రమైన తలనొప్పులు వస్తాయని పేర్కొంటున్నారు. అయితే అప్పుడప్పుడు కలిగే స్క్రీన్ అలసటను సాధారణంగా తీసుకోవచ్చని, కానీ ఏకాగ్రత లోపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తరచుగా తలనొప్పులు వేధించడం వంటి లక్షణాలు రెండు వారాలకు పైగా కొనసాగితే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. ఈ నరాల సంబంధిత సమస్యలు తీవ్రరూపం దాల్చకముందే స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం ఎంతో మేలని నిపుణులు హితవు పలుకుతున్నారు.