ఫిట్‌నెస్‌తో పాటు గుండె ఆరోగ్యం ముఖ్యం.. చీట్ డేస్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం
సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: ఆధునిక జీవనశైలిలో చాలామంది ఆరోగ్యంగా ఉండేందుకు కఠినమైన వ్యాయామాలు, ప్రత్యేక ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు. అయితే డైటింగ్ చేసేవారు కొద్దిరోజుల పాటు కష్టపడిన తర్వాత తమకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు చీట్ డేస్‌ను ఎంచుకోవడం సాధారణమైపోయింది. ఇలా వారం మొత్తం నియమాలను పాటించి, ఒక్కరోజు తమకు ఇష్టమైనకేలరీల ఆహారాన్ని తీసుకోవడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుందని భావిస్తుంటారు. కానీ ఈ అలవాటు శారీరక ఆరోగ్యంపై, ముఖ్యంగా గుండె పనితీరుపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై ఆరోగ్య నిపుణులు పలు కీలక హెచ్చరికలు జేస్తున్నారు.
క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తూ, బాడీ ఫిట్‌గా ఉన్నప్పటికీ గుండె ఆరోగ్యం విషయంలో కేవలం పైకి కనిపించే ఫిట్‌నెస్‌ను మాత్రమే నమ్ముకోవడం పొరపాటని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వారంలో ఒకరోజు విపరీతమైన నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ లేదా అధిక ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది నేరుగా గుండెపై అదనపు భారాన్ని మోపుతుందని, రక్తపోటు సమస్యలకు దారితీస్తుందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కేవలం బరువు తగ్గడం లేదా కండరాల పటుత్వం మాత్రమే కాకుండా, గుండె లోపలి ఆర్యోగం కూడా దీర్ఘకాలంలో సక్రమంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో సమతుల్యత చాలా అవసరం.
పెద్ద మొత్తంలో చీట్ మీల్స్ తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా మారుతుంటాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడటమే కాకుండా గుండె జబ్బుల ముప్పు క్రమంగా పెరుగుతుంది. కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూనే అతిగా తినే అలవాటుకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద ఎత్తున చీట్ డేస్ నిర్వహించే బదులు మితంగా ఇష్టమైన పదార్థాలను ఆస్వాదించడం లేదా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా కాపాడుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.