ఐదు భాషల్లో భారీ పాన్ ఇండియా డివోషనల్ మూవీ.. వారాహి అమ్మన్ టైటిల్ ఖరారు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భక్తి తత్వంతో పాటు అత్యాధునిక సాంకేతిక హంగులను జోడించి తెరకెక్కించనున్న ఒక భారీ పాన్ ఇండియా పౌరాణిక భక్తి చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి వారాహి అమ్మన్ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. వారాహి అమ్మవారి దివ్య మహిమలు, ఆమె కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అత్యుత్తమ దృశ్య కావ్యంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు.
వీకేవీ పిక్చర్స్ మరియు స్టెల్లార్ క్రాఫ్ట్ స్టూడియోస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నవీన్ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ వడివేలన్ పీజే, చంద్రశేఖరన్ వీఎం నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సెల్లార్‌క్రాఫ్ట్ స్టూడియోస్ నుంచి బాలసుబ్రహ్మణ్యం, బాలాజీ కన్నియప్పన్ సహ నిర్మాతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భక్తి వైభవం ఉట్టిపడే ఈ కథను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా అత్యున్నత ప్రమాైణాలతో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో విజువల్స్ పరంగా ఎక్కడా రాజీపడకుండా అత్యాధునిక వీఎఫ్ఎక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకోసం చెన్నైకి చెందిన ప్రముఖ యూఎస్ ఆధారిత సంస్థ బిక్సర్ స్టూడియోస్‌కు గ్రాఫిక్స్ బాధ్యతలను అప్పగించారు. అంతర్జాతీయ స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేలా ఈ విజువల్స్ ఉండబోతున్నాయని, ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
Also Read: జేమ్స్ బాండ్ 007గా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిన్సన్.. కొత్త లుక్ సంచలనం!