బిగ్‌బాస్ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తత, కెప్టెన్ మినహా అందరూ నామినేషన్స్‌లో
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు టెలివిజన్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్ పదో సీజన్ రసవత్తరంగా మునుముందుకు సాగుతోంది. ఇప్పటికే పదకొండో వారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో సోమవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాదనలకు, ఘర్షణలకు వేదికగా మారింది. గడచిన వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా నాయుడు హౌస్ నుంచి బయటకు వెళ్లగా, ఈ వారం ప్రారంభంలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వారం డిక్టేటర్స్ థీమ్‌తో సాగుతున్న గేమ్‌లో మాజీ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇస్తుండటంతో ఆట మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ వారపు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సభ్యులపై విమర్శలు గుప్పిస్తూ నామినేట్ చేయడం ప్రారంభించారు. హౌస్‌లోకి మళ్లీ అడుగుపెట్టిన చరణ్ రాగానే అమన్ మరియు సుధీర్‌లను నామినేట్ చేయగా, శ్వేతా నాయుడు వచ్చి రామ్‌ప్రసాద్‌ను టార్గెట్ చేసింది. అదేవిధంగా చైత్ర వచ్చి వంశీని నామినేట్ చేయగా, వర్షిణి మరియు అమన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముకేశ్ లేకపోతే నీ ఆట లేదంటూ వర్షిణిపై అమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు సృష్టి వచ్చి రామకృష్ణను అలాగే వర్షిణిని నామినేట్ చేస్తూ విమర్శలు గుప్పించడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఇంటి సభ్యుల మధ్య జరిగిన ఈ నామినేషన్ల పరంపరలో త్రిగుణ్ మరియు ముకేశ్ మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ప్రస్తుత హౌస్ కెప్టెన్‌గా ఉన్న నరేశ్‌కు ప్రత్యేక అధికారం ఇస్తూ ఇద్దరు సభ్యులను నామినేట్ చేసే ఛాన్స్‌ను బిగ్‌బాస్ ఇవ్వగా, ఆయన శివతో పాటు రామకృష్ణను నామినేట్ చేశారు. ఈ సమయంలో నరేశ్ మరియు రామకృష్ణ మధ్య జరిగిన వాదనలోకి త్రిగుణ్ ఎంటరై రామకృష్ణను టార్గెట్ చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ గొడవ కొట్టుకునేంత వరకు వెళ్లడంతో అక్కడే ఉన్న తోటి కంటెస్టెంట్లు వారిని శాంతింపజేయాల్సి వచ్చింది.
ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి ఊహించని విధంగా కెప్టెన్ నరేశ్ మినహా హౌస్‌లో ఉన్న మిగతా అందరు కంటెస్టెంట్లు ఈ వారం ఎమినేషన్స్ బరిలో నిలిచారు. గత వారాలతో పోలిస్తే ఈసారి నామినేషన్ల వేడి చాలా ఎక్కువగా ఉండటంతో రాబోయే రోజుల్లో హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, హౌస్‌లో ఎవరి మధ్య యుద్ధం నడుస్తుందనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో రోజురోజుకూ పెరుగుతోంది.
Also Read: అక్వాన్ తుపాను హెచ్చరిక: యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు