యూబీఎస్‌లో 200 ఉద్యోగాల కోత
సూర్య బిజినెస్ డెస్క్, లండన్: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ (UBS Group AG) ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను కొనసాగిస్తోంది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) కొనుగోలు అనంతరం చేపట్టిన భారీ విలీనం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా లండన్‌లోని తమ కార్యకలాపాల నుంచి సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. ఇటీవల పూర్తి చేసిన అంతర్గత మదింపు ఆధారంగా వివిధ విభాగాల వారీగా ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా యూబీఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగాలపై పడింది. విలీనం వల్ల ఏర్పడిన పోస్టుల పునరావృతం, గ్లోబల్ డీల్‌మేకింగ్ కార్యకలాపాల్లో నెలకొన్న మందగమనం కారణంగా ఈ విభాగాల్లోని సిబ్బందిని తగ్గించారు. వీటితో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన బ్యాక్-ఎండ్, ఐటీ, కార్పొరేట్ సపోర్ట్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా తొలగించారు. అయితే ప్రతి విభాగం నుంచి ఎంత మందిని తొలగించారనే కచ్చితమైన సంఖ్యను బ్యాంక్ బహిర్గతం చేయలేదు.
2023లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ప్రత్యర్థి బ్యాంక్ క్రెడిట్ సూయిస్‌ను రక్షించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో యూబీఎస్ చారిత్రక కొనుగోలు చేపట్టింది. ఈ విలీనంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 1.20 లక్షలకు చేరింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం, వ్యవస్థను క్రమబద్ధీకరించే ప్రణాళికలో భాగంగా అప్పటి నుంచి ఇప్పటివరకు యూబీఎస్ తమ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 18 శాతం వరకు కోత విధించింది. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తాజా లేఆఫ్స్‌లో ప్రభావితమైన అర్హులైన సిబ్బందికి బ్యాంక్ అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించే వెసులుబాటు కల్పించనుంది.