టీచర్ల పై దాడి నిందితులను వదిలిపెట్టం..
టీచర్ల పై దాడి నిందితులను
వదిలిపెట్టం
-స్పోర్ట్స్ కోటా టీచర్ల పై దాడికి దిగారంటూ లోకేశ్ ఆగ్రహం
-దైవం వంటి గురువులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
-దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను జగన్ అవమానిస్తున్నారని ఆరోపణ
-రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను టీచర్లపైకి ఉసిగొల్పారని విమర్శ
-ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల జోలికి రావొద్దని హితవు
-విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్
సూర్య , ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
విజయవాడలో స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లపై దాడికి వైసీపీ ముఠాలు దాడికి దిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. క్రీడాకారులుగా దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి అన్యాయం చేయడం సరికాదని అన్నారు. దైవంలా భావించే టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి బయటపడిందని లోకేశ్ విమర్శించారు. క్రీడల్లో ప్రతిభ చూపించి టీచర్ ఉద్యోగాలు సాధించిన వారిని వైసీపీ అవమానిస్తోందని ఆరోపించారు.తమకు న్యాయం చేయాలంటూ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లు విజయవాడ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని లోకేశ్ తెలిపారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు టీచర్లపై దాడికి దిగారని ఆరోపించారు.
రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను టీచర్లపైకి ఉసిగొల్పారని లోకేశ్ ఆరోపించారు. గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేయడం దారుణమని అన్నారు.టీచర్లపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలని సూచించారు.
శాప్ కార్యాలయం వద్ద రాళ్లు, కోడిగుడ్లతో అల్లర్లు
శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతల అల్లర్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దేవినేని అవినాష్, జోగి రమేష్ రౌడీ గ్యాంగులతో శాప్ కార్యాలయం వద్ద రాళ్లు, కోడిగుడ్లతో అల్లర్లకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు, ఉపాధ్యాయులను అవమానించడం సరికాదని మంత్రి హితవు పలికారు.ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉద్రిక్తత సృష్టించడం తగదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వైఎస్సార్సీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు
శాప్ కార్యాలయం ముట్టడికి వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే భౌతిక దాడులకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లపై దాడులకు పాల్పడటం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేయడం అత్యంత హేయమైన చర్యగా దుయ్యబట్టారు. ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. టీచర్లపై భౌతిక దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని మంత్రి స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులపై రాళ్లు, రాడ్లు, వాటర్ బాటిళ్లతో దాడి
వైఎస్సార్సీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించామని తెలిపారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై రాళ్లు, రాడ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేయడానికి సిగ్గుండాలన్నారు. శాప్ కార్యాలయంపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రీడాకారులని అవమానించడం, ఉద్యోగులని అవమానించడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. 5 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యోగాన్ని భర్తీ చేయని జగన్ రెడ్డి ఈరోజు డీఎస్సీ గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 10th క్లాస్ పేపర్లు కొట్టేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. గొడ్డలి పార్టీ నాయకులు శాప్ కార్యాలయం మీద దౌర్జన్యానికి వెళ్లడం అనాగరికమన్నారు.