andhrapradesh
పోలీస్ సంక్షేమమే లక్ష్యం.. ప్రజలకు నాణ్యమైన ఇంధనం
పోలీస్ సంక్షేమమే లక్ష్యం.. ప్రజలకు నాణ్యమైన ఇంధనం
- పామూరులో నూతన పెట్రోల్ బంక్‌కు శంకుస్థాపన చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
- పోలీస్ సిబ్బందితోపాటు సాధారణ ప్రజలకు అందుబాటులోకి పెట్రోల్ బంక్
- ఐఓసీఎల్ భాగస్వామ్యంతో నిర్మాణం
- త్వరలోనే సేవలు ప్రారంభం
పామూరు, మేజర్ న్యూస్ :
పోలీస్ సిబ్బంది సంక్షేమంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యంగా పామూరులో నూతన పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పామూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించనున్న నూతన పెట్రోల్ బంక్‌కు సోమవారం ఎస్పీ శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పామూరులో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్‌లో భాగంగా జిల్లాలోని పోలీస్ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పెట్రోల్ బంక్ పోలీస్ సిబ్బందితోపాటు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు నిరంతరం విధులు నిర్వహిస్తున్నందున వాటికి ఇంధనం అత్యంత కీలకమన్నారు. నూతన పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడంతో పోలీస్ వాహనాలకు సకాలంలో ఇంధనం లభించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలాలకు మరింత వేగంగా చేరుకుని సమర్థవంతంగా స్పందించే అవకాశం కలుగుతుందన్నారు.
పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ శాఖలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పెట్రోల్ బంక్ ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి ఇంచార్జి డీఎస్పీ పి. శ్రీధర్, పామూరు సీఐ వినోద్ కుమార్,పొదిలి సీఐ యం. రాజేష్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవప్రభాకర్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, ఆర్ఐ సీతారామిరెడ్డి, కనిగిరి సబ్ డివిజన్ ఎస్సైలు, ఏఆర్ ఎస్సై తిరుపతి స్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.