విద్యుత్, ఇంధన పొదుపుతోనే సుస్థిర భవిష్యత్తు అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు అవగాహన
అవనిగడ్డ, నవంబర్ 2 మేజర్ న్యూస్: విద్యుత్, ఇంధన పొదుపు అలవాట్లను ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో, దైనందిన జీవితంలో పాటించాలని అవనిగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ కె. హనుమంతరావు పిలుపునిచ్చారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా సోమవారం అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది ఉద్యోగులతో సుస్థిర జీవన విధానాలపై ప్రతిజ్ఞ చేయించారు.
సదస్సులో హనుమంతరావు మాట్లాడుతూ సాధారణ బల్బులకు బదులుగా ఎల్ఈడీ లైట్లను వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని తెలిపారు. బస్సులకు సరైన టైర్ ప్రెజర్ నిర్వహించడం, సకాలంలో సర్వీసింగ్ చేయించడం, అనవసరంగా ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచకపోవడం, వేగ పరిమితులను పాటించడం ద్వారా డీజిల్ పొదుపుతోపాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు.
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజిన్‌ను ఆఫ్ చేయడం, బస్సు నడుపుతున్నప్పుడు క్లచ్‌పై కాలు ఉంచకుండా ఉండడం వంటి మంచి డ్రైవింగ్ అలవాట్లతో ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచడం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతోపాటు యంత్రాలపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు.
విద్యుత్, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగి ఈ ఐదు సూత్రాలను పాటిస్తూ సుస్థిర భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ✍️అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా