వెంకటేశ్వర స్వామి ఆలయంలో వర్ణ యాగం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఎల్ నినో ప్రభావంతో తగ్గిన వర్షపాతం.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ వేంకటేశ్వరుడికి ప్రత్యేక ప్రార్థనలు
ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వ సూచనల మేరకు అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక వరుణ యాగాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమలాపురం శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు ఈ ఆధ్యాత్మిక క్రతువులో పాల్గొని స్వామివారికి, వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆలయంలో ఉన్న పవిత్ర కొలను వద్ద వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వరుణ దేవునికి హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలకు చేరుకుని శాస్త్రోక్తంగా వరుణ యాగాన్ని ప్రారంభించారు. పండితులు మంత్రోచ్ఛారణలు చేస్తుండగా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం తగ్గడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వరుణ యాగాలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఆపదమొక్కులవాడైన ఆ శ్రీనివాసుడి కరుణతో, వరుణ దేవుని అనుగ్రహంతో నియోజకవర్గంతో పాటు రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ ధర్మకర్తలు, పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.