వరి పంట పొలాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్
- సాగునీటికి అంతరాయం రానీయద్దు
ఈ -క్రాప్ బుకింగ్ వేగవంతం
ఆమదాలవలస సూర్య: ఆమదాలవలస మండలం కలివరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం వరి పంట పొలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. క్షేత్రస్థాయి తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదిక ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ, సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు అందజేశారు. పంట పొలాల్లో పంట పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సాగు చేస్తున్న పద్ధతులను, ప్రభుత్వం నుండి అందిస్తున్న వ్యవసాయ శాఖ సేవలను రైతుల నుంచి వివరాలు సేకరించారు. నారాయణపురం సాగునీటి కాలువ ద్వారా సాగునీటిని నిరంతరం సక్రమంగా పంట పొలాలకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా నీటి విడుదలను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నందున సాగునీటి సరఫరా సక్రమంగా జరగాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా సాగునీటిని అందించాలని తెలియజేశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ బి. సత్యం, మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు, మండల సర్వేయర్ బి. గోపి, వ్యవసాయ సహాయకులు బి. రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.