వైసిపి కష్ట కాలంలో నిలబడిన వారికి తగిన ప్రాధాన్యత
వైసీపీ కష్టకాలంలో నిలబడిన వారికి తగిన ప్రాధాన్యత
ఏరు దాటాక తెప్ప తగలేసే రాజకీయం మా నాన్న నేర్పలేదు
ముద్రగడ గిరిబాబు
ఓమ్మంగి లో ‘వెన్నుపోటు ప్రభుత్వంపై పోరు’ కార్యక్రమం
ప్రత్తిపాడు మేజర్ న్యూస్
వైసీపీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటామని, బయటి వారిని తెచ్చి స్థానికుల నెత్తిమీద పెట్టే పరిస్థితి ఉండదని నియోజకవర్గ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు స్పష్టం చేశారు. ఓమ్మంగి గ్రామంలో ఆదివారం సాయంత్రం ‘వెన్నుపోటు ప్రభుత్వంపై పోరు’ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ రామిశెట్టి నాని అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో గిరిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఐదేళ్ల తమ ప్రభుత్వంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ, అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా సంక్షేమ ఫలాలు అందించారని గుర్తుచేశారు. కూటమి ప్రవాహాన్ని ఎదుర్కొని నిలబడిన నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటానన్నారు. “ఏరు దాటాక తెప్ప తగలేసే రాజకీయం తన తండ్రి ముద్రగడ పద్మనాభం తనకు నేర్పలేదు” అని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ స్థానంలో పోటీ చేసి వైఎస్సార్సీపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతీ కార్యకర్తకూ రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారని, ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఇటీవల పదవీకాలం ముగిసిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులను గిరిబాబు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బెహరా దొరబాబు, జల్లిగంపల ప్రభాకర్ రావు, దొడ్డిపట్ల సోమన్న దొర, రాపా గుర్రాజు, గోనగాల అప్పలరాజు తదితరులు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.