కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
కార్తీక మాసం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు
అన్నవరం, అక్టోబర్ 4, ఆదివారం:
కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచక్రధర్ రావు ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు.
కార్తీక మాసంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్వామివారి దర్శనం, వ్రతాలు, ప్రసాదాల పంపిణీ, క్యూ లైన్లు, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై అధికారులు సమీక్షించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, దర్శనం మరియు వ్రతాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఈఓ నల్లం సూర్యచక్రధర్ రావు అధికారులకు సూచించారు.
అలాగే వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదిక కమిటీ సమన్వయంతో పనిచేసి కార్తీక మాసంలో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.