ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. మరో రెండు రోజులు అప్రమత్తత
విశాఖపట్నం: ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. భారత వాతావరణ శాఖ తాజా వివరాల ప్రకారం, తీవ్ర వాయుగుండం ఇప్పటికే ఉత్తరాంధ్ర తీరాన్ని దాటి భూభాగంలోకి ప్రవేశించింది.
తీరాన్ని దాటినప్పటికీ దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ తదితర ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తీవ్ర వాయుగుండం తదుపరి 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా నదులు, వాగులు, కాలువలు పొంగే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు.
తీరం దాటింది కాబట్టి ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు భావించవద్దని, ఇవాళ, రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన భవనాలు, హోర్డింగ్‌ల సమీపంలో ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారిక సమాచారం కోసం మాత్రమే ప్రభుత్వ వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖల ప్రకటనలను అనుసరించాలని సూచించారు.