ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ
అనంతపురం బ్యూరో
ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ
అనంతపురం పట్టణంలోని ట్రెల్లిస్ స్కూల్‌ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదనరావు, ఉండవల్లి గాంధీ బాబు గురువారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఇటీవల పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పాఠశాలలో భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల నిర్వహణ, బాలల రక్షణ విధానాలను పరిశీలించారు. ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన కమిషన్ సభ్యులు, పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అమలు చేయాలని సూచించారు.
విద్యార్థులకు ‘సేఫ్ టచ్–అన్‌సేఫ్ టచ్’పై అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల వ్యవహారశైలి, విద్యాబోధన, టాయిలెట్ల పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సాజిదా బేగం, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి పాల్గొన్నారు.